పద్మశాలీయ వంశ చరిత్ర -విశిష్టత

పద్మశాలీలు:

పద్మశాలి కులము బ్రాహ్మణ కులాలకు చెందిన ఉపకులము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించే వీరిలో మతాలను అనుసరించి శైవులు, వైష్ణవులుగా ఉన్నారు. వృత్తులను అనుసరించి కైకాల, కర్ణభక్తులు, పట్టుసాలి, సేనాపతులు, తొగటసాలీలుగా విడిపోయారు.

 నిర్వచనము:

పద్మము అనగా  తామర పువ్వు లేదా కమలము. శాలి అనగా వస్త్రము తులు భాషలో సాలీ అనగా సాలెపురుగు. పద్మశాలి అను పదమునకు భౌతికంగా విజ్ఞానము అని అర్థము. వైష్ణవుల ప్రకారము పద్మము అనగా ఉన్నతమైన మానవుడి మేధస్సును ప్రతిబింబించే సహస్రధార పద్మము అని అర్థము.

శైవుల ప్రకారము మానవాళి యొక్క నగ్నత్వానికి వస్త్రాలు ధరింపచేయాలనే ఉద్దేశంతో శివుడు మార్కండేయని యాగాన్ని నిర్వహించమని చెప్పాడు. ఆ యాగం నుంచి భావన అను ఋషి చేతిలో పద్మముతో ఉద్భవించాడు.. అతడు సూర్యభగవానుడి కుమార్తెలైన ప్రసన్నవతి, భద్రావతిలను వివాహం చేసుకొని నూరున్నొక్క కుమారులకు తండ్రి అయ్యాడు. ఆ కుమారులు పద్మము యొక్క నారతో వస్త్రాలను తయారు చేసే వృత్తిని ఎన్నుకొని పద్మశాలీల నూరున్నొక్క గోత్రాలకు గోత్ర పురుషులయ్యారు. పురాణాల ప్రకారం తిరుపతిలోని మంగాపురంలో ఉన్న పద్మావతి అమ్మవారు (తిరుపతి వెంకటేశ్వరుని భార్య) తాను పద్మశాలి కుమార్తెగా చెప్పుకున్నది. దీని ప్రకారంగా పద్మశాలి అను కులం ఏర్పడిందని చెప్పవచ్చు.

 గ్రంథ మూలాలు:

హిందూ గ్రంథాల ప్రకారం పద్మశాక అనువాడు బ్రహ్మ తమ కులానికి ఇచ్చిన అద్భుతమైన రత్నం యొక్క మహిమను గణపతి(వినాయకుడు)కి వివరించేందుకు విముఖత చూపాడు. ఫలితంగా గణపతి శాపంతో పద్మశాలీలు బ్రాహ్మణ స్థాయిని కోల్పోయారు.  శాపవిమోచనం కోసం పద్మశాలీ కులానికి చెందిన పరబ్రహ్మ మూర్తి (పద్మ భావనాచార్య) అను కారణ జన్ముడు గణపతికి మొర పెట్టుకున్నాడు. పర బ్రహ్మమూర్తి తపస్సుకు మెచ్చిన గణపతి.. కలియుగంలో 5000 సంవత్సరాల తర్వాత పద్మశాలీలు శాపవిమోచనం పొందుతారని చెప్పాడు. ఈ పరబ్రహ్మమూర్తి తన కులస్థులను 101 గోత్రాలతో 8 శాఖలుగా విడదీసి 4 మఠాలు స్థాపించి వాటికి గురువులను నియమించాడు.

 ఆచార వ్యవహారాలు:

సనాత బ్రాహ్మణ కులాలకు, పద్మశాలీలకు ఆచార వ్యవహారాల్లో చాలా వ్యత్యాసం ఉంది. పద్మశాలీల్లో ఒక్క పట్టుశాలి శాఖ తప్ప మిగిలిన శాఖల వారు మాంసాహారం కూడా భుజిస్తారు.  వీరి ఆచార వ్యవహారాల్లో ఆర్య మరియు ద్రవిడ సంస్కృతులు కనిపిస్తాయి. అందువలన పద్మశాలీలు సమాజంలో సనాతన బ్రాహ్మణులుగా పరిగణింపబడలేదు. పద్మశాలీలకు ఉపనయన సంస్కారము మరియు జంధ్యము ధారణ కలదు.